తెలుగు బ్లాగులు ఎందుకు చదవాలి అంటే..
నాకు రాయడమంటే ఇష్టం.. అది సహజంగా నాకు అలవడింది కాదు కానీ, పరిస్థితుల ప్రభావం నన్ను ఈ రంగం వైపు అడుగులు వేయించింది. తెల్లని కాగితం మీద నీలపు అక్షరాలు జాలువారుతూంటే.. మనసవ్వటం అంటే అదేనేమో!! ఇప్పటకీ ఈ-మెయిల్ కన్నా ఉత్తరానికే నా ఆదరణ. అలాంటిది నేను.. తెలుగు బ్లాగు ప్రపంచంలోకి చాలా లేట్ ఎంట్రీ ఇచ్చాననే చెప్పుకోవాలి. తెలుగు బ్లాగులు అంతగా రాయకపోయినా.. నేను తెలుగు బ్లాగులు బాగానే చదువుతా. మొన్నామధ్య సౌమ్య గారి.. “ఎందుకు చదవాలి?”, అటు తర్వాత మరెవరిదో.. “తెలుగులో ఎందుకు చదవాలి” అన్న టపాలు చదివాకా.. తెలుగు బ్లాగులు వల్ల నేను నేర్చుకున్న జీవితం, ఈ టపాలో చెప్పాలనిపిస్తుంది.
భాషోద్యమం
తెలుగు నాశనం అయ్యిపోతుంది. తెలుగుకి భవిష్యత్తు లేదు.. ఆంగ్లం అనే ఉప్పెనలో తెలుగు కొట్టుకుపోతుంది అని జనాలు గోల చేస్తుంటే.. నా వంతు సంతాపం పాటించేదాన్ని. కాని ఇప్పుడు ఆ భయమే లేదు.. చిట్టి చిన్నా తవికల నుండి,.. సమస్యా పూరణాల వరకు తెలుగు మీద పట్టున్నవారిని చదివితే ముచ్చటవేస్తుంది. అల్లసాని వారి పద్యాలనుండి నేటితరం రచయితల వరకు అందరి గురించి, అన్నింటి గురించి తెలుగు బ్లాగుల వల్ల నేర్చుకోవచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతీ “పాడాలని ఉంది” ఎపిసోడ్లో తెలుగుకు పట్టుబట్ట కట్టమని మనవిచేస్తారు. ఇక్కడ ఇంచుమించు అదే జరుగుతుంది. చదివి మీ వంతు సహాయం అందించండి.
జ్ఞాన సంపుటి
రేపు ఎవరైనా “జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది.. మంచి సైట్ చెప్పు” అని అడిగితే.. కూడలి, జల్లెడ చూడమంటా!! మన వాళ్ళు మిస్స్ అయ్యే జాతీయాంతర్జాతీయ విశేషాలు ఏమీ ఉండవు. వార్తలే కాదు.. వాటి విశ్లేషణలు, వివరణలు, అభిప్రాయాలు చాలా బాగుంటాయి. Competitive Exams కోసమే కాదు, అనేక విశేష వార్తలు మొద్దుబారిన మెదడుకు కొత్త ఉత్సాహం ఇస్తాయి.
స్నేహానికి అడ్డా
పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అంటారు. కాని మంచి పుస్తకాన్ని ఎన్నుకోవటం అంత తేలిక కాదు. సౌమ్య గారు, చదువరి గారు పుస్తకాలను పరిచయం చేసే విధానం ఎంత అద్బుతంగా ఉంటుందంటే.. ఆ పుస్తకం చదవకపోతే.. జీవితంలో ఎదో కోల్పోయిన భావం కలుగుతుంది. సాహితీ వ్యాసాలకు కొదవలేదు. పుస్తకప్రియులకు తెలుగుబ్లాగు అడ్డా అనే చెప్పాలి. ఇక మాటా మాటా కలిసి, అభిప్రాయాలు ఏకమై స్నేహితులుగా మారేవారెందరో!!
మనసు మాటై.. మాట మనసై
టపా పెరగన్నం అయితే.. దానికొచ్చే వ్యాఖ్యలు ఆవకాయ లాంటివి అని ఎవరో బ్లాగరు ఏదో సందర్భంలో అన్నారు. నిజమే.. మనసు మాటలు కాదు.. తేలికగా మాటల్లో పెట్టాలి అంటే!! చాలా కష్టపడో.. లేదా ఆవేశంలో మనకి తోచింది రాసేసాకా.. ఓ రిలీఫ్ ఉంటుంది. ఇతరులు ఆ టపాను చదివి.. అర్ధం చేసుకుని, అన్వయించుకుని, ఆరాధించి, వ్యాఖ్యానించినప్పుడు కలిగే ఆనందం వర్ణానాతీతం. నా బ్లాగులో ఇప్పటి వరకు నాకొచ్చిన చాలా కమ్మెంట్స్ అపరిచుతులనుండే !! “మన ఇద్దరి Frequency ఒక్కటే” అని అనుకునే సందర్భాలు బ్లాగ్లోకంలో కోకొల్లలు.
స్ట్రెస్స్ బస్టర్
Please అన్న పదం వాడిన ప్రతీసారి.. ఆలోచనలో పడతా.. నన్నూ బినిత అనుకుంటారేమో జనం అని. అంతలా పాతుకుపోయింది రెండు రెళ్ళ ఆరు నా బుర్రలో!! ఆఫీసులో ఎవరైనా మూడీగా కనిపిస్తే.. కొన్ని తెలుగు బ్లాగుల లింకులు కొడతావారికి.. దెబ్బకు నవ్వుకుంటారు. వ్యంగ్యంలో మనకు మనమే సాటి అని నా అభిప్రాయం. తీవ్రమైన పరిస్థితులలో కూడా నవ్వు కలిగించే ఆభరణం మన బ్లాగ్గర్లది.
చదువుట వ్రాయుటకొరకే
ఇంతా చదివాకా.. ఆలోచించకుండా ఉండలేము. ఆలోచించాకా.. స్పందించకుండా.. వ్రాయకుండా ఉండలేము. చదివాక రాస్తాము.. రాసేసాక మళ్లీ చదువుకుంటాము. ఇది ఒక లూప్. ఆరోగ్యకరమైన ప్రయాణం.
ఈ కారణాలకే కాదు మరెందుకైనా… తెలుగు బ్లాగులు చదువుతూనే ఉండండి.