దేవునితో పోటీ
ఒకానొక సైంటిస్టుల బృందం బల్ల చుట్టు గుండ్రంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, తన అవసరం ఇక ఎవరికీ లేదని దేవునికి ఎవరు చెప్పాలా అని.
చివరికి ఒకానొక వాలంటీరు సిద్ధమయ్యాడు దేవునికి చెప్పటానికి.
సైంటిస్టు: “దేవుడా, మేము ఈ విషయాన్ని బాగా ఆలోచించుకున్నాము, అదే చెప్పడానికి నేను వచ్చాను, ఇక మానవులకు నీ అవసరం లేదు. ఇప్పటికే అనేక వైజ్ఞానిక విషయాలను మేము తెలుసుకున్నాం, ఎంతో సాంకేతిక ప్రగతిని సాధించాం. సృష్టికి ప్రతిసృష్టి చేశాం, గొర్రె నుండి గొర్రెను సృష్టించాం, మనిషి నుండి మనిషిని తయారు చేయడానికి ఎంతో దూరంలో లేము. కాబట్టి మీతో అవసరం మాకు తీరిపోయింది”
దేవుడు (అర్థం చేసుకున్నట్లు తల ఊపి): “సరే. నా మనోభావాలు దెబ్బతినలేదు కానీ, మీరన్నది చేసే ముందు ఒక పోటీ పెట్టుకుందాం! ఏమంటావు?”
సైంటిస్టు: “తప్పకుండా. ఎమిటా పోటీ?”
దేవుడు: “మనిషి బొమ్మను చేసే పోటీ”
సైంటిస్టు: “ఓస్ అంతేనా! తప్పకుండా” అని కిందికి వంగి కొంత మట్టిని తీసుకొని “నేను రెడీ!” అని అన్నాడు.
దేవుడు: “ఆగాగు… నీ మట్టిని నువ్వే తెచ్చుకోవాలి”
దేవుడు, భర్త, భార్య
ఒకాయన పొలంలో తన భార్యను గురించి, ఆవిడ యొక్క మంచితనాన్ని గురించి, ఆవిడను పెళ్ళి చేసుకోవడంలోని అదృష్టం గురించి ఆలోచిస్తూ తిరుగుతున్నాడు.
దేవున్ని అడిగాడు, “ఆమెలో ఎందుకు అంత దయను పుట్టించావు?”
దేవుడి జవాబు, “ఆమెను నీవు ప్రేమించడానికి నాయనా”
“ఆమెను ఎందుకు అంత అందంగా తయారు చేశావు?”
“ఆమెను నీవు ప్రేమించడానికి నాయనా”
“అంత రుచికరమైన వంటలను ఎందుకు నేర్పావు?”
“ఆమెను నీవు ప్రేమించడానికి నాయనా”
రెండు క్షణాలు ఆలోచించిన పిమ్మట: “కృతజ్ఞత లోపించింది అని అనుకోవద్దు ప్రభూ, ఆమెను ఎందుకు అంత తెలివి లేని దానిగా తయారు చేశావు?”
“ఆమె నిన్ను ప్రేమించడానికి నాయనా”
జోకానువాదం – 45: మనలో పాపం చేయని వారు…
నిస్సహాయతతో పరిగెడుతున్న దీన యువతిని, ఆమె వెనకాల రాళ్ళతో పరిగెత్తుతున్న గుంపును చూసిన ఏసు, వారిని ఉద్దేశించి, “ఎందుకలా ఆవిడ వెనకాల పరిగెత్తుతున్నారు” అని సంయమనంతో ప్రశ్నించాడు.
“అయ్యా, ఈమె ఒక వెలయాలు, మన చట్ట ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి!” గుంపులో ఒకాయన జవాబిచ్చాడు.
“ఆగండాగండి,” గట్టిగా అన్నారు ఏసు, “ఎవరైతే ఏ పాపం చేయలేదో వారే మొట్టమొదటి రాయిని వెయ్యాలి”.
మబ్బుల నుండి ఒక చిన్న గులక రాయి ఆవిడ నెత్తి మీద ఠపీమని పడింది.
“మీరు ఆగండి నాన్న గారు…” ఆకాశం వైపు చూస్తూ ఏసు ఇంకా గట్టిగా అన్నారు, “ఇక్కడ నేనొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను!”
జోకానువాదం – 46: కంటి-చెవి డాక్టరు
ఒక జర్నలిస్టు ఆసుపత్రికి వెళ్ళి, “నేను కంటి-చెవి డాక్టరును చూడాలి” అని రిసెప్షనిస్టును అడిగాడు.
“మా దగ్గర అటువంటి డాక్టర్లు లేరు”, అన్నది ఆమె, “మీకు వేరే డాక్టరు కావాలా?”.
“లేదు నాకు కంటి-చెవి డాక్టరే కావాలి,” పట్టుదలగా అన్నాడా పాత్రికేయుడు.
“అటువంటి డాక్టర్లు ఉండరు అనుకుంటాను,” బదులిచ్చింది ఆవిడ. “కంటి డాక్టర్లు ఉన్నారు, ముక్కు-చెవి-గొంతు డాక్టర్లు ఉన్నారు, అయినా మీరు కంటి-చెవి డాక్టరు కోసం ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా?”.
“ఎందుకంటే…నాకు కనబడేది ఒకటి, వినబడేది మరొకటి”, విషాదంగా మారిపోయింది ఆయన గొంతు, “…రెంటికి పొంతన ఉండటం లేదు”.