పనాజీ: ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులను కొద్దిరోజుల కిందట జామియానగర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేసిన కేసులో… అరెస్టు చేసినవారు అమాయకులని విచారణలో తేలితే తాము యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్ చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన వారికి తమ పార్టీ న్యాయసహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. నిజంగా వారు తీవ్రవాదులైతే చంపేయాలనీ, అమాయకులైతే మాత్రం వారికి న్యాయ సహాయం అందించాలని అమర్‌సింగ్ అన్నారు. ఈ కేసును వాదించేందుకు సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ అంగీకరించారు.
అక్టోబర్ 7, 2008
ఆర్థికవృద్ధి కొనసాగుతుంది: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా, భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి రేటుతోనే ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం చెప్పారు. ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాదికి 8 శాతం వుంటుందనీ, వచ్చే ఏడాదికల్లా అది 9 శాతానికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు భారత్‌పై కొద్దిపాటి ప్రభావాన్ని చూపినా, దేశ ఆర్థిక వ్యవస్థ వీటన్నింటినీ తట్టుకుని స్థిరంగా నిలబడిందని ఆయన చెప్పారు.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌరవ్ గంగూలీ
బంగళూరు: రిటైర్మెంట్‌పై వస్తున్న వూహాగానాలకు తెరదించుతూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్‌గంగూలీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్ క్రికెట్ తర్వాత తాను క్రికెట్ నుంచి తప్పుకుంటానని గంగూలీ ఉద్వేగంగా చెప్పారు. ఈ సిరీస్ గెలుపుతో కెరీర్‌ను ముగిస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తనకు సహకరించిన వారందరకీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పొత్తులపై తుది నిర్ణయం 12న: కారత్
హైదరాబాద్: ఎన్నికల పొత్తులపై ఈ నెల 12 నుంచీ ప్రారంభం కానున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రకాశ్ కారత్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్, భాజపాల ఓటమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కమిటీ అభిప్రాయాన్ని తెలుసుకున్నామనీ, వాటిని కేంద్ర కమిటీకి నివేదిస్తామని కారత్ తెలిపారు. పొత్తుల విషయంలో సీపీఐదీ, తమదీ ఒకే అభిప్రాయమని కారత్ అన్నారు.
దుల్హేలో కొనసాగుతున్న కర్ఫ్యూ
దుల్హే: ఉత్తర మహరాష్ట్రలోని దుల్హే పట్టణంలో నిన్న విధించిన కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. ఆదివారం నుంచీ జరుగుతున్న మతఘర్షణల్లో ఇప్పటికి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. 126 మంది గాయపడ్డారు. అల్లర్లకు కారకులని అనుమానిస్తున్న 77 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
భజరంగ్‌దళ్ తీవ్రవాద సంస్థ: కేంద్రం
పాట్నా: భజరంగ్‌దళ్ తీవ్రవాద సంస్థ అనీ, ‘సిమి’ని నిషేధించినట్లుగానే ఈ సంస్థనూ నిషేధించడానికి కేంద్రప్రభుత్వం వెనకాడబోదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి షకీల్ అహ్మద్ అన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, భజరంగ్‌దళ్ కార్యకలాపాల వల్ల రాష్ట్రంలో హింస, భయోత్పాతం ఏర్పడుతున్నాయని నాలుగైదు రాష్ట్రాలు కేంద్రానికి ఓ రిపోర్టు పంపితే కేంద్రం ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సంస్థపై నిషేధం విధించడానికి సరిపోయే ఆధారాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని షకీల్ అహ్మద్ చెప్పారు.
ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బహుమతి
స్టాక్‌హోమ్: ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని ఫిజిక్స్ విభాగంలో ఈ ఏడాది ఇద్దరు జపనీయులు, ఓ అమెరికన్ సంయుక్తంగా అందుకోనున్నారు. రాయల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈరోజు ఈ అవార్డులను ప్రకటించింది. డిసెంబరు 10న జరిగే ఓ కార్యక్రమంలో వీరికి ఈ బహుమతి అందించనున్నారు.
13నుంచి బాబు అవినీతి వ్యతిరేక ఉద్యమం
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గాంధీ జయంతిరోజు అవినీతిపై ఉద్యమం ప్రారంభించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయదశమి అనంతరం దాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా 13వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తారు. 14వ తేదీన మెదక్ జిల్లాలో, 15వ తేదీన కరీంనగర్‌లో ఆయన పర్యటిస్తారు.
సీనియర్లతో రేపు మరోసారి బాబు భేటీ
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈరోజు జరిగిన టీడీపీ పౌలిట్‌బ్యూరో సమావేశంలో ఈరోజు తెలంగాణాపై విధాన ప్రకటన చేసే అంశంపై చర్చ జరిగింది. చివరకు రేపు కూడా దీనిపై చర్చ జరపాలని నిర్ణయించారు. సీనియర్లతో రేపు దీనిపై చర్చ జరుపుతారు. ఇప్పుడు చేసే నిర్ణయం పార్టీపై అత్యంత ప్రభావం చూపే విషయం కనుక దీనిపై కూలంకషంగా చర్చిస్తున్నారు. విజయదశమిరోజు విధాన ప్రకటన చేయాలని నిర్ణయించారు.
మోసం చేసేందుకు సిద్ధమవుతున్న తెరాస: భాజపా
హైదరాబాద్: కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి తనకు తాను ఉరి వేసుకుంటున్నారని భాజపా జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణా ప్రజలను మోసం చేసిన తెరాస ఇప్పుడు వామపక్షాలతో కలిసి మోసం చేసేందుకు సిద్ధం అవుతోందని ఆయన అన్నారు. ఎరువుల నౌకను హైజాక్ చేశారన్న వ్యవసాయమంత్రి రఘువీరా మాటలను ఆయన తప్పుపట్టారు. ఎరువుల కొరత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనం వల్లే ఏర్పడిందన్నారు.